Aug 10, 2009

అమ్మకానికున్నాయి !

అమ్మకానికున్నాయి !
సగం గీసిన చిత్రం
సగం కట్టిన ఇల్లు
సగం కన్న కల
ఎవరైనా కొనవచ్చు!
అమ్మకానికున్నాయి !
సగం వ్రాసిన డైరి
సగం మనసు
సగం వయసు

అచ్చమైన తెల్ల కాగితంపై
ఎపుడో గీసిన రంగుల చిత్రం
అక్కడక్కడ మాసిపోయింది
కొంచెం మురికి పట్టింది
కొంచెం మరక పడింది
చెదలు తినగా మిగిలిన సగం చిత్రం
అమ్మకానికుంది!
కళ తెలిసినవారు కొనవచ్చు!
లేదంటే వదిలి వేయవచ్చు

పైకప్పులేని ఒంటరి ఇంట్లో
వెల్లికిలా పడుకొని
అందమైన రేపటి కోసం
నిరీక్షిస్తూ కన్నటి సగం కల
అమ్మకానికుంది !
"కల"కారులుంటే కొనవచ్చు
నచ్చకపోతే మరిచిపోవచ్చు

ఎవరి దినచర్యనో నాదనుకొని
అదే మైకములో రేయింబవళ్ళు గడిపి
మూలుగుతూ....దొర్లుతూ.....
నన్ను నేనే వెతుకుతూ....
నేను వ్రాసిన, నేను లేని
సగం డైరీ పుటలు
అమ్మకానికున్నాయి !
రచయితలుంటే కొనవచ్చు
వద్దనుకుంటే కాల్చవచ్చు

విషయాసక్తిలో కరిగిపోయింది
సగం వయసు
మత్తిలిన దారులలో కోల్పోయింది
సగం మనసు
మనసులేని మనసులో
వయసు కాని వయసులో
అమ్ముకుంటున్నాను - నన్ను నేను
ప్రేమ ఉంటే కొనవచ్చు
నీతి తప్పాననిపిస్తే చంపవచ్చు !

కన్నడ మూలం : హెచ్. ఎస్. బొళ్మాడి.

[This poem is published with the same title in "Saahiti prasthanam" of November 2009 edition. Page no. 11]

2 comments:

  1. బాగుంది.

    నేను కొనడానికి
    కనడానికి
    కలుపుకోవడానికి
    కమ్మదనం అనుభవించడనికీ రెడీ
    నాకు అమ్మెయ్!

    ReplyDelete
  2. నీకైతె....
    సగం చిత్రం కాదు
    సగం ఇల్లు కాదు
    సగం కల కాదు
    సగం వ్రాసిన డైరి
    సగం మనసు
    సగం వయసు కాదు...
    మొత్తం తీస్కొ.

    ReplyDelete